Zimbabwe: అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే.. భారత్ ర్యాంక్ 103

Zimbabwe Named Most Miserable Country In The World Indias Rank Is 103

  • జింబాబ్వేలో 243 శాతానికి ద్రవ్యోల్బణం
  • కనీవినీ ఎరుగని స్థాయిలో వడ్డీ రేట్లు, నిరుద్యోగ సమస్యలు
  • భారత్ లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన
  • మెరుగైన స్థానంలో స్విట్జర్లాండ్, కువైట్, ఐర్లాండ్, జపాన్

ఈ ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశంగా జింబాబ్వేని ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్ హాంకే ప్రకటించారు. 2022 వార్షిక దయనీయ సూచీని హాంకే విడుదల చేశారు. ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాల ఆధారంగా దేశాలకు ఆయన ర్యాంకులు కేటాయిస్తుంటారు. యుద్ధాలతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్, సిరియా, సూడాన్ లను మించి జింబాబ్వే పరిస్థితి దీనంగా ఉండడానికి హాంకే కారణాలు కూడా ప్రస్తావించారు. జింబాబ్వేలో ద్రవ్యోల్బణం గతేడాది 243.8 శాతానికి చేరిపోయింది. దీంతో అధిక నిరుద్యోగం, అధిక రుణ రేట్లు, బలహీన జీడీపీ వృద్ధితో జింబాబ్వే మొదటి స్థానంలో ఉన్నట్టు హాంకే చెప్పారు. 

టాప్ -15 దయనీయమైన దేశాల్లో వరుసగా జింబాబ్వే, వెనెజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతి, అంగోలా, టోంగా, ఘనా ఉన్నాయి. మొత్తం 157 దేశాలకు సూచీలో స్థానం కల్పించారు. అన్నింటికంటే స్విట్జర్లాండ్ లో దయనీయ స్కోరు తక్కువగా ఉంది. అంటే ఈ దేశ ప్రజలు ఎక్కువ సంతోషంతో ఉన్నారు. దేశ జీడీపీలో రుణ భారం చాలా తక్కువగా ఉండడం ఆనందానికి కారణమని హాంకే వివరించారు. రెండో సంతోషకర దేశంగా కువైట్ ఉంది. ఆ తర్వాత ఐర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్, నైగర్, థాయిలాండ్, టోగో, మాల్టా ఉన్నాయి. 

భారత్ కు 103వ ర్యాంక్ ను కేటాయించారు. భారత్ లో నిరుద్యోగ సమస్య వల్లే ఈ ర్యాంక్ ను ఇచ్చారు. అమెరికాకు 134వ ర్యాంక్ ఇచ్చారు. అమెరికన్ల సంతోషాన్ని నిరుద్యోగం ఆవిరి చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా గుర్తింపు పొందే ఫిన్లాండ్ ఈ సూచీలో 109వ స్థానంలో ఉంది. అంటే భారత్ కంటే కేవలం ఆరు స్థానాలు ఎక్కువ. స్టీవ్ హాంకే జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో అప్లయిడ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News