Somireddy Chandra Mohan Reddy: తమ్ముడి కళ్లలో ఆనందం చూడ్డానికే జగన్ ఈ భారీ స్కాంకు తెరలేపారు: సోమిరెడ్డి
- ట్రాన్స్ ఫార్మర్లు, మీటర్ల కొనుగోలులో భారీ స్కాం జరిగిందని ఆరోపించిన సోమిరెడ్డి
- డిస్కంల సీఎండీలు స్పందించడంలేదని ఆగ్రహం
- విద్యుత్ శాఖ కార్యదర్శి విజయానంద్ ఏంచేస్తున్నారంటూ నిలదీసిన సోమిరెడ్డి
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత మూడు విద్యుత్ డిస్కంల పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు, నిర్వహణ, స్మార్ట్ మీటర్ల కొనుగోలులో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు.
ఈ స్కాం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడమే గాక ప్రజలపై పెనుభారం పడుతోందని వెల్లడించారు. మూడు డిస్కంలకు కలిపి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.78 వేల కోట్లు చెల్లించాలని, ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ స్మార్ట్ మీటర్ల పేరుతో మరో రూ.29 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందని సోమిరెడ్డి వివరించారు.
"కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బినామీ అయిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టి దోచిపెట్టడానికి హద్దులు దాటి వ్యవహరించారు. 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.58,569 ఉంటే, దాన్ని రూ.1,78,800కి పెంచారు.
63 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ను రూ.89 వేలు నుంచి రూ.2.54 లక్షలకు... 160 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ను రూ.2 లక్షల నుంచి రూ.5.69 లక్షలకు... 315 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ను రూ. 5.71 లక్షల నుంచి రూ.16.75 లక్షలకు పెంచారు. ఇలా అడ్డగోలుగా ట్రాన్స్ ఫార్మర్ల ధరలు పెంచి సరఫరా కాంట్రాక్టును గంపగుత్తగా షిరీడీ సాయి చేతిలో పెట్టారు.
గతంలో నాలుగు కంపెనీలు ట్రాన్స్ ఫార్మర్లను సరఫరా చేయగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క షిరిడీ సాయి సంస్థకే ఆ అవకాశం ఇచ్చారు. ట్రాన్స్ ఫార్మర్ల తరహాలోనే ఇప్పుడు స్మార్ట్ మీటర్ల విషయంలోనూ భారీ స్కామ్ కు తెరలేపారు. ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా మూడు డిస్కంల సీఎండీలను కోరితే స్పందించలేదు. నేను విద్యుత్ శాఖ కార్యదర్శిని సంప్రదించిన తర్వాత ఒక్క ఈపీడీసీఎల్ అధికారులు కొంత సమాచారం పంపారు.
బిడ్డింగ్ లో రెండు సంస్థలే పాల్గొన్నాయని, 2.58 లక్షల అగ్రికల్చర్ సర్వీసులకు పెట్టాల్సిన ఒక్కో మీటరుకు షిరిడీ సాయి సంస్థ రూ.23,647కి, అదానీ కంపెనీ రూ.24,300కి కోట్ చేశాయని పేర్కొన్నారు. అదానీ కంటే షిరిడీ సాయి సంస్థ నామమాత్రంగా రూ.600 తక్కువకు కోట్ చేయడం వెనుక భారీ స్కామ్ దాగి వుంది.
ఒక్కో మీటరుకు మెయింటెనెన్స్ తో కలిపి రూ.36,975గా నిర్ణయించారు. దీనివల్ల ఇంట్లో మీటర్ రీడింగ్ కు నెలకు రూ.153, ఏడాదికి రూ.1840 వినియోగదారుడు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాణిజ్య, పరిశ్రమ కనెక్షన్లకు మీటర్ రీడింగ్ కు నెలకు రూ.241.90 ఏడాదికి రూ.2,903 చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. ప్రస్తుతం మీటర్ రీడింగ్ రూ. 5.30 పైసలు ఖర్చు అవుతుండగా దానిని రూ.153కి పెంచబోతున్నారు. అవినాశ్ రెడ్డి బినామీ కంపెనీ అయిన షిరిడీ సాయికి స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు దక్కినందుకు ప్రజలపై పడుతున్న భారమిది. తమ్ముడి కళ్లలో ఆనందం చూడటానికే ఈ భారీ స్కామ్ కు జగన్ రెడ్డి తెరలేపారు.
మీటర్ల టెండర్ల విషయంలో భారీ స్కామ్ జరగబట్టే మొత్తం వివరాలను బయటపెట్టేందుకు అధికారులు జంకుతున్నారు. ఈ కాంట్రాక్టుల కేటాయింపు డీల్ మొత్తం కడపలోని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ కార్యాలయంలోనే జరిగింది. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆధ్వర్యంలో షిరిడీ సాయి ఆఫీసులో సమీక్షలు నిర్వహించి కాంట్రాక్టును వారికి సెటిల్ చేశారు. పక్కా సమాచారంతో మేం ఈ విషయం చెబుతున్నాం.
గూగూల్ టేక్ అవుట్ తీస్తే అవినాశ్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ, అధికారులు, షిరిడీ సాయి ఎండీ విశ్వేశ్వరరెడ్డిల సమావేశాల గుట్టు మొత్తం బయటపడుతుంది. సీబీఐ విచారణ జరిగితేనే ఈ కుంభకోణం మొత్తం వెలుగులోకి వస్తుంది. ఈ కుంభకోణం ద్వారా చేతులు మారిన డబ్బు నేరమయమైన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నేరస్తులైన పొలిటికల్ లీడర్ల చేతుల్లోకి పోయిన విషయం సీబీఐ కూపీ లాగితేనే తేలుతోంది. ఈ డబ్బంతా అవినాశ్ రెడ్డి చేతుల్లోకి ఎలా చేరిందీ... ఆయన దగ్గర నుంచి ఎవరెవరికి చెల్లించారు... ఎందుకు చెల్లించారు... ప్రధానంగా క్రిమినల్స్ కు ఎందుకు చెల్లింపులు జరిగాయనే విషయం బయటకు రావాలంటే సీబీఐ విచారణతోనే సాధ్యం.
ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే విద్యుత్ శాఖ కార్యదర్శి విజయానంద్ ఏం చేస్తున్నారు? ఈ విషయంలో న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం..మా శాయశక్తులా పోరాటం సాగించి తాడోపేడో తేల్చుకుంటాం. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వెంటనే స్పందించి ఈ స్కామ్ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నుంచి బయటపడటానికి ఈ డబ్బంతా ఎక్కడ ఎవరికి చేరిందో కూడా తేలాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవరిస్తూ పోతే అంతిమంగా బాధితులు ఏపీలోని ఐదు కోట్ల ప్రజలే. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి ఈ స్కామ్ ద్వారా పడే భారం నుంచి విముక్తుల్ని చేయాలి” అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.