Amit Shah: పార్లమెంటు ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరినీ పిలుస్తాం... ఆ తర్వాత మీ ఇష్టం: విపక్షాలకు అమిత్ షా సూచన
- హస్తినలో కొత్త పార్లమెంటు భవనం
- మే 28న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన విపక్షాలు
- ఎవరి మనోభావాలకు తగినట్టుగా వాళ్లు నడుచుకోవచ్చన్న అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవన సముదాయాన్ని మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనుండగా, ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రాజకీయ పార్టీని, ప్రతి ఒక్క ఎంపీని ఆహ్వానిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఎవరి మనోభావాలకు తగ్గట్టుగా వారు నడుచుకుంటారని, ఈ కార్యక్రమానికి రావాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది విపక్షాలేనని అన్నారు. అయితే, సెంగోల్ (రాజదండం) ప్రతిష్టాపన సమయంలో నిర్వహించే వైదిక క్రతువులను మాత్రం రాజకీయం చేయవద్దని విపక్షాలకు సూచించారు. భారత ప్రాచీన సంప్రదాయాలను ఆధునిక భారతదేశంతో సంధానం చేసే కార్యక్రమంగానే దీన్ని భావించాలని పిలుపునిచ్చారు.
నాడు బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపోతూ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అధికారం బదిలీ చేస్తూ ఈ రాజదండాన్ని అప్పగించారు. ఇప్పుడా రాజదండాన్ని మోదీ నూతన పార్లమెంటు భవనంలో స్పీకర్ కుర్చీ సమీపంలో ప్రతిష్టించనున్నారు.