Uttar Pradesh: కారునైతే చోరీ చేశారు కానీ.. డ్రైవింగ్ రాక 10 కిలోమీటర్లు తోసుకెళ్లారు!
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
- నిందితుల్లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు
- ఈజీ మనీ కోసం చోరీల బాట
ఈజీ మనీ కోసం కారును దొంగిలించిన ముగ్గురు యువకులు డ్రైవింగ్ చేతకాకపోవడంతో 10 కిలోమీటర్లు దానిని నెట్టుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో జరిగిందీ ఘటన. నిందితులు ముగ్గురు ప్రస్తుతం ఊచలు లెక్కపెట్టుకుంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దబౌలి ప్రాంతానికి చెందిన సత్యం కుమార్, అమన్ బీటెక్ చదువుతున్నారు. అపార్ట్‌మెంట్‌లో పనిచేసే అమిత్‌తో వీరికి పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో కార్ల దొంగతనాలకు తెరలేపారు.
ఈ క్రమంలో బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22న రాత్రి ఓ మారుతి కారును దొంగిలించారు. కారునైతే దొంగిలించారు కానీ వారిలో ఒక్కరికి కూడా కారు డ్రైవింగ్ చేతకాదు. దీంతో కారును తోసుకుంటూ 10 కిలోమీటర్లు తీసుకెళ్లారు. అక్కడ ఓ నిర్మానుష్య ప్రదేశంలో కారు నంబరు ప్లేటును తీసేసి పార్కింగ్ చేసి వెళ్లిపోయారు. కారు యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారుతోపాటు మరో రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.