Alla Ramakrishna Reddy: నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
- వైసీపీకి దూరంగా ఉంటున్నారంటూ ఆర్కేపై ప్రచారం
- కొన్ని రోజులు విదేశాలకు వెళ్తే వైసీపీకి దూరంగా ఉన్నానని ప్రచారం చేస్తున్నారంటూ ఆర్కే మండిపాటు
- వైసీపీలో తనకు అసంతృప్తి ఎందుకు ఉంటుందని ప్రశ్న
కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్తే, వైసీపీకి దూరంగా ఉన్నానంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. తన ప్రయాణం ఎప్పటికీ జగన్ తోనే అని ఆయన స్పష్టం చేశారు. అయినా, వైసీపీలో తనకు అసంతృప్తి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
అమరావతి ప్రాంతంలో పేదల సొంత ఇంటి కల నెరవేరబోతోందని ఆర్కే చెప్పారు. మొత్తం 50 వేల మంది లబ్ధిదారుల్లో 22 వేల మంది మంగళగిరి నియోజకవర్గానికి చెందినవారేనని తెలిపారు. నారా లోకేశ్ ను ఓడించడానికే అమరావతిలో ఇళ్ల పట్టాలను ఇస్తున్నారని చెప్పడం సరికాదని అన్నారు. ఈ ఇంటి స్థలాలను సమాధులతో పోల్చిన చంద్రబాబుకు మతి స్థిమితం తప్పిందని చెప్పారు. ఇళ్లు లేని పేదలకు ఇవి తాజ్ మహల్ వంటివని అన్నారు. దీపావళి నాటికి ఈ స్థలాల్లో ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరుతానని చెప్పారు.
మరోవైపు, ఆళ్లకు జగన్ ఈసారి టికెట్ ఇవ్వడం లేదని... దీంతో, ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. పార్టీ అధికారిక కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారని చెపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా స్పందించారు.