Nikhil: జేడీఎస్ కీలక పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి కొడుకు
- కర్ణాటక ఎన్నికల్లో కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచిన జేడీఎస్
- పార్టీ యువజన విభాగం అధ్యక్ష పదవికి నిఖిల్ రాజీనామా
- పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామికి చెందిన జేడీఎస్ పార్టీ ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోయింది. హంగ్ ఏర్పడితే కుమారస్వామి కింగ్ మేకర్ గా మారతారని అందరూ అంచనా వేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో అన్నీ తలకిందులయ్యాయి.
మరోవైపు కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కూడా ఓటమిపాలు అయ్యారు. ఈ నేపథ్యంలో నిఖిల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఓటమికి బాధ్యతగా పార్టీ యువజన విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు. రాజీనామా లేఖను పార్టీ వ్యవస్థాపకుడు, తన తాత దేవెగౌడకు, పార్టీ కర్ణాటక అధ్యక్షుడు ఇబ్రహీంలకు పంపించారు.
నిఖిల్ రాజీనామా ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తదుపరి యువజన విభాగం అధ్యక్షుడి బాధ్యతలను కుమారస్వామి సోదరుడు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ కు ఇస్తారా? దీనికి కుమారస్వామి అంగీకరిస్తారా? అనే చర్చ సాగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.