Priyank Kharge: అదే జరిగితే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తాం: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే
- శాంతికి భంగం కలిగించే ఏ సంస్థనైనా నిషేధిస్తామన్న మంత్రి
- గత ప్రభుత్వం చేసిన చట్టాలను సమీక్షిస్తామన్న ప్రియాంక్ ఖర్గే
- టిప్పు సుల్తాన్ జయంతి విషయంలో దాటవేత
తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామంటూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అలాంటి వ్యాఖ్యలే చేసి చర్చకు తెరలేపారు. రాష్ట్రంలో శాంతికి భంగం కలిగించే ఏ సంఘాన్నైనా నిషేధిస్తామని, అది బజరంగ్ దళ్ అయినా, ఆరెస్సెస్ అయినా ఒకటేనని స్ఫష్టం చేశారు. విధాన సభలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకను తాము అన్ని మతాలకు శాంతివనంగా మారుస్తామన్న ఆయన.. ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఎవరైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అలాగే, గత ప్రభుత్వం చేసిన హిజాబ్, హలాల్‌కట్, మతమార్పిడి బిల్లు, గోవధ నిషేధ చట్టాలను ప్రభుత్వం మరోమారు పరిశీలిస్తుందన్నారు. అయితే, టిప్పు సుల్తాన్ జయంతిని చేపట్టే విషయంలో ప్రభుత్వ వైఖరిని దాటవేశారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని హిందూ సంఘాలు అసభ్యకర పోస్టులు పెడుతున్నాయని, మతం ముసుగులో ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.