Neerabh: హిట్లర్ ను పొగిడి జాబ్ పోగొట్టుకున్న డెలాయిట్ ఉద్యోగి
- సోషల్ మీడియాలో పోస్టుపై తీవ్రంగా స్పందించిన కంపెనీ
- గంటల వ్యవధిలోనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన
- సంస్థ అంతర్గత నియమాలను ఉల్లంఘించారని ఆరోపణ
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఓ యువకుడి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. పోస్టు పెట్టిన గంటల వ్యవధిలోనే ఉద్యోగం ఊడింది. చరిత్రలో క్రూరుడైన నియంతగా నిలిచిన అడాల్ఫ్ హిట్లర్ ను పొగుడుతూ పోస్టు పెట్టడమే దీనికి కారణం. సాప్ట్ వేర్ దిగ్గజ కంపెనీ డెలాయిట్ లో నీరభ్ మెహ్రోత్రా అసోసియేట్ డైరెక్టర్, రిస్క్ అడ్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ది డార్క్ చార్మ్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్ బుక్ ను చదివానని, ఆ తర్వాతే అడాల్ఫ్ హిట్లర్ గురించి, రెండో ప్రపంచ యుద్ధం గురించి సరైన అవగాహన వచ్చిందని నీరభ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. హిట్లర్ ఆకర్షణీయమైన వ్యక్తి అని, ఆయనే తన హీరో అని అందులో రాసుకొచ్చాడు. ఈ బుక్ చదివాక హిట్లర్ అభిమానిగా మారిపోయానని చెప్పాడు.
నీరభ్ పోస్ట్ వైరల్ గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. హిట్లర్ ను పొగుడుతావా అంటూ నీరభ్ పై మండిపడుతూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదంటూ నీరభ్ మరో పోస్టులో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. తనను క్షమించాలంటూ ఓ లేఖ కూడా రాశాడు. అయినా ఉపయోగంలేకుండా పోయింది.
విషయం కాస్తా నీరభ్ పనిచేస్తున్న కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన డెలాయిట్.. నీరభ్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై నీరభ్ తో తమ కంపెనీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. కంపెనీ అంతర్గత నియమాలను ఉల్లంఘించారని, సోషల్ మీడియాలో నీరభ్ వ్యక్తం చేసిన అభిప్రాయం సంస్థ భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే నీరభ్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వివరణ ఇచ్చింది.