Elon Musk: ఉద్యోగులను తగ్గిస్తే ఫలితాలు బాగున్నాయ్.. మీరూ ఇలానే చేయండి: మస్క్ సలహా
- తోటి కంపెనీలకు సలహా ఇచ్చిన మస్క్
- గతేడాది ట్విట్టర్ కొనుగోలు నాటికి అందులో 7,500 మంది ఉద్యోగులు
- ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిగిలింది 1,500 మంది
టెస్లా, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ఉద్యోగుల తగ్గింపునకు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది ట్విట్టర్ ను రూ.3.4 లక్షల కోట్లకు కొనుగోలు చేసిన నెల వ్యవధిలోనే 60 శాతానికి పైగా ఉద్యోగులను ఆయన పీకి పారేశారు. 7,500 మంది ఉద్యోగుల సంఖ్యను 3,500కు కోసేశారు. అంతేకాదు ఆ తర్వాతి నెలల్లోనూ ఆయన మరికొంత మందిని గెంటేశాడు. మస్క్ వ్యవహార శైలి నచ్చక తామే రాజీనామా చేసి వెళ్లిపోయిన వారూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ లో కేవలం 1,500 మంది ఉద్యోగులే మిగిలారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్న చందంగా.. ‘‘ఉద్యోగులను తొలగించడం వల్ల ఫలితాలు బాగున్నాయి. మీరు కూడా ఇదే మార్గాన్ని అనుసరించండి’’ అంటూ మస్క్ మిగిలిన కంపెనీలకు కూడా ఓ ఉచిత సలహా పడేశారు.
‘‘చాలా కంపెనీల్లో పనులను ముందుకు తీసుకెళ్లే ఉద్యోగులు ఉంటారు. ఉత్పాదకతను తగ్గించే వారూ ఉంటారు. ట్విట్టర్ లో పది మందికి తొమ్మిది మంది ఉత్పాదకత పడిపోయింది’’ అని మస్క్ చెప్పారు. సిలికాన్ వ్యాలీ కంపెనీల్లో చాలా మంది చేసే పనికి విలువే ఉండడం లేదన్నారు. ట్విట్టర్ లో ఉద్యోగుల తొలగింపుల వల్ల అవాంతరాలు ఏర్పడ్డాయిగా? అన్న ప్రశ్నకు.. అవి సహజమేనని, ఇన్ స్టా గ్రామ్ లోనూ ఇటీవలే అలాంటి పరిస్థితి చూసినట్టు చెప్పారు. ట్వట్టర్ ను గత యాజమాన్యం ఓ స్వచ్ఛంద సంస్థ మాదిరిగా నడిపించిందని మస్క్ లోగడే విమర్శించడం గమనార్హం.