Kiren Rijiju: అరుణాచల్ ప్రదేశ్ లో ఎర్ర పాండాల దర్శనం.. వీడియో
- అంతరించిపోతున్న జంతువుల్లో ఇది కూడా ఒకటి
- వీడియో, ఫొటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి రిజుజు
- వీటిని అందరం కలసి కాపాడుకుందామని పిలుపు
పాండాలు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. వీటి కోసం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. మన దేశంలోనే అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్ కు వెళితే చాలు. వీటికి సంబంధించిన ఓ వీడియోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో షేర్ చేశారు. అసలు ఈ వీడియోని అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖండు వెలుగులోకి తీసుకొచ్చారు.
‘‘అందంగా ఉన్న ఈ చిన్న రెడ్ పాండా తవాంగ్ లో కనిపించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచుర్ ‘అంతరించి పోతున్న జాతుల్లో’ ఇది కూడా ఉంది. వెదురు పుల్లలు, ఆకులను తిని జీవించే ఈ పాండాలకు హిమాలయ పర్వత ప్రాంతాలు ఆలవాలంగా ఉన్నాయి. మనమంతా కలసి వాటిని సంరక్షిద్దాం. జీవ వైవిధ్యానికి అవి ఎంతో ముఖ్యం’’ అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేర్కొన్నారు.
‘‘ఎంతో ఆదరణీయమైన ఈ చిన్న ఎర్ర పాండా తవాంగ్ లో కనిపించింది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖాండు దీన్ని షేర్ చేశారు. మన దగ్గరి అందమైన ఈ జంతువులను కాపాడుకుందాం’’ అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. అలాగే, ఎర్రపాండా ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్లోని కలింపోంగ్ జిల్లాల్లో ఇది కనిపిస్తుంది’’ అని రిజుజు తెలిపారు.