Jay Shah: ఐపీఎల్ ఫైనల్ అనంతరం ఆసియాకప్ పై తుది నిర్ణయం: జైషా
- ఇప్పటివరకైతే ఆసియా కప్ పై నిర్ణయం తీసుకోలేదన్న బీసీసీఐ కార్యదర్శి
- ఐపీఎల్ ఫైనల్ కోసం శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల ప్రతినిధులు
- ఆ సమయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
ఆసియా కప్ భవితవ్యం త్వరలోనే తేలిపోనుంది. ఐపీఎల్ ఫైనల్ అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. ఒక్క దేశమా, లేక ఒకటికి మించిన దేశాలు ఆతిథ్యం ఇస్తాయా అన్నది త్వరలో జరిగే ఆసియాకప్ భాగస్వామ్య దేశాల ప్రతినిధుల సమక్షంలో నిర్ణయిస్తామన్నారు. ‘‘ఇప్పటి వరకు ఆసియాకప్ ను ఎవరు నిర్వహిస్తారన్నది తేలలేదు. ఐపీఎల్ తో బిజీగా ఉన్నాం. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుల నుంచి ప్రముఖులు ఐపీఎల్ ఫైనల్ చూసేందుకు రానున్నారు. ఆ సమయంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని జైషా వివరించారు.
వాస్తవానికి అయితే పాకిస్థాన్ లో ఆసియాకప్ జరగాల్సి ఉంది. ఆ దేశానికి భారత జట్టు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ద్వైపాక్షిక క్రీడా మ్యాచ్ లు రెండు దేశాల మధ్య చాలా కాలంగా జరగడం లేదు. ఆ దేశానికి భారత జట్టు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. ఇది వచ్చే అవకాశం లేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నజమ్ సేతి హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆప్ఘనిస్థాన్.. పాకిస్థాన్ భూభాగంపై ఆడతాయి. భారత్ తో మ్యాచులు తటస్థ వేదికపై నిర్వహించడం అన్నది సేతి చేసిన ప్రతిపాదన. దీనిపై బీసీసీఐ ఇంకా తన అభిప్రాయం ప్రకటించలేదు. మొత్తానికి ఐపీఎల్ ఫైనల్ తర్వాత స్పష్టత రానుంది.