Amul: అమూల్ పై ఇప్పుడు తమిళనాడులో ఆందోళన.. కేంద్రం జోక్యం కోరిన సీఎం స్టాలిన్

Amul Infringing On Aavin MK Stalin Writes To Amit Shah In New Milk Row
  • తమిళనాడులో అమూల్ పాలు సేకరించకుండా చూడాలని డిమాండ్
  • అమూల్ రాకతో కోఆపరేటివ్ సంస్థల మధ్య అనారోగ్యకర పోటీ
  • కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో పేర్కొన్న సీఎం స్టాలిన్
గుజరాత్ కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ పై ఇటీవలే కర్ణాటకలో ఎన్నికల ముందు పెద్ద దుమారం లేవడం చూశాం. కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ అమూల్ పట్ల స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రం జోక్యం కోరుతూ హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తక్షణమే తమిళనాడు నుంచి అమూల్ (ఆనంద్ మిల్క్ లిమిటెడ్/గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్)  పాలు సేకరించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తమిళనాడులో పాడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అమూల్ తరఫున కైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ పాలు సేకరిస్తున్న విషయాన్ని స్టాలిన్ ప్రస్తావించారు. అమూల్ తనకున్న మల్టీ స్టేట్ కోఆపరేటివ్ లైసెన్స్ ఆధారంగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో పాల ప్రాసెసింగ్, చిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు స్టాలిన్ పేర్కొన్నారు. కృష్ణగిరి, ధర్మపురి, వెల్లోర్, రాణీపేట్, తిరుపత్తూర్, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల్లో అమూల్ పాలు సేకరించనున్నట్టు వివరించారు. 

కోపరేటివ్ సంస్థలు వేటికవే వాటి పరిధిలో పాల సేకరణకు పరిమితం కావాలన్నది సాధారణ నిబంధన అని, ఇలా ఇతర ప్రాంతాల్లో పాల సేకరణ అన్నది క్షీర విప్లవ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో పాలకు కొరత ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. పాలను సేకరించి మార్కెటింగ్ చేసే కోఆపరేటివ్ సంస్థల మధ్య అనారోగ్యకర పోటీకి అమూల్ తీసుకున్న నిర్ణయం వీలు కల్పిస్తుందన్నారు. కనుక వెంటనే జోక్యం చేసుకుని తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్ ను నిరోధించాలని స్టాలిన్ కోరారు.
Amul
milk procure
Tamilnadu
mk stalin
cm
amith shah
letter

More Telugu News