Karnataka: విద్యా సంస్థల్లో హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేయనున్న సిద్ధరామయ్య ప్రభుత్వం?
- కర్ణాటకలో హిజాబ్ పై నిషేధం విధించిన గత బీజేపీ ప్రభుత్వం
- నిషేధాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయంలోనే చెప్పిన డీకే
- మతమార్పిడి చట్టాన్ని కూడా ఎత్తివేసే అవకాశం
కర్ణాటకలోని విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు మతపరమైన హిజాబ్ ను ధరించకూడదంటూ గత బీజేపీ ప్రభుత్వం నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అయితే హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసే దిశగా సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ప్రచార సమయంలోనే... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిజాబ్ నిషేధంతో పాటు మతపరంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని చట్టాలను ఎత్తివేస్తామని చెప్పారు.
తాజాగా మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తి వేస్తామని చెప్పారు. గోవధ, హలాల్ కట్ వంటి చట్టాలను కూడా ఉపసంహరిస్తామని తెలిపారు. మతమార్పిడి నిషేధ చట్టాన్ని కూడా ఉపసంహరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు కనకపుర టౌన్ సమీపంలోని కపాలబెట్టలో 114 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే దానిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.