Rohit Sharma: బ్యాటింగ్ లో యాంకర్ పాత్రకు కాలం చెల్లింది: రోహిత్ శర్మ
- ఒకప్పుడు క్రీజులో పాతుకుపోయి యాంకర్ రోల్ పోషించేవాళ్లన్న రోహిత్
- ఇప్పుడు టీ20 క్రికెట్ ఆడే విధానం మారిపోయిందని వెల్లడి
- వచ్చీ రావడంతోనే బాదేస్తున్నారని వివరణ
- తాను కూడా ఆటతీరు మార్చుకుంటానని వ్యాఖ్యలు
ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభంలో పడుతూ లేస్తూ ప్రస్థానం సాగించిన ముంబయి ఇండియన్స్ టోర్నీ సాగే కొద్దీ పుంజుకుంది. ప్లే ఆఫ్ దశలో నాలుగో స్థానం సంపాదించుకున్న ముంబయి ఇండియన్స్... నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో, ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒకప్పుడు క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్ నిర్మిస్తూ యాంకర్ రోల్ పోషించే ఆటగాళ్లకు ప్రాముఖ్యత ఉండేదని, కానీ ఇప్పుడు టీ20 క్రికెట్ ఆడుతున్న విధానం చూస్తే అలాంటి యాంకర్ రోల్ కు కాలం చెల్లిందని చెప్పొచ్చని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. వచ్చీ రావడంతోనే బాదేయడం ఇప్పటి స్టయిల్ అని వివరించాడు. ఒకవేళ 20 పరుగులకే మూడ్నాలుగు వికెట్లు పడితే అప్పుడు యాంకర్ పాత్ర గురించి ఆలోచించవచ్చని, అది కూడా ఎప్పుడో తప్ప అలా జరగదని వివరించారు.
తాను ఎప్పటి నుంచో టీ20 క్రికెట్ ఆడుతున్నానని, ఇప్పుడు కొత్త రోహిత్ ను చూపించాలనుకుంటున్నానని ఈ హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.