Anand Mahindra: ప్రమాదంలో పిల్లల్ని కాపాడే టీ షర్ట్.. ఆనంద్ మహీంద్రా పోస్ట్
- టీ షర్ట్ ధరిస్తే చాలు.. నీటిలో మునిగిపోకుండా రక్షణ
- ఆటోమేటిక్ గా తెరుచుకునే బెలూన్
- గొప్ప ఆవిష్కరణగా పేర్కొన్న ఆనంద్ మహీంద్రా
విజ్ఞానంతోనే కొత్త ఆవిష్కరణలు పురుడు పోసుకుంటుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కూడా ఓ ప్రతిభావంతుడి మేధస్సు నుంచి వెలుగు చూసిన గొప్ప ఆవిష్కరణగా చెప్పుకోవాలి. చిన్నారులు అంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నడక వచ్చిన చిన్నారులు ఇల్లంతా కలియ తిరుగుతుంటారు. ఈ క్రమంలో నీటి బకెట్ లో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. అలాగే, వరదల సమయంలోనూ చిన్నారుల ప్రాణాలకు రిస్క్ ఉంటుంది. ఈ సమయంలో వారిని ఎవరో ఒకరు కాపాడే వరకు ప్రాణాలతో సురక్షితంగా ఉంచే ఆవిష్కరణ ఇది. దీన్ని మెచ్చుకుంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు.
ఇదో వినూత్నమైన టీ షర్ట్. పిల్లలకు ధరిస్తే చాలు. వారు నీటిలో పడిపోయిన సమయంలో ఆటోమేటిక్ గా బెలూన్ తెరుచుకుంటుంది. దీంతో దాన్ని ధరించిన చిన్నారులు నీటిపై తేలియాడతారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో బెలూన్స్ తెరుచుకున్న మాదిరేనని అనుకోవచ్చు. ‘‘ఇది నోబెల్ ప్రైజ్ గెలుచుకోకపోవచ్చు. నా దృష్టిలో నోబెల్ ప్రైజ్ గెలుచుకునే ఆవిష్కరణల కంటే ఇది గొప్పది. ఇద్దరు పిల్లలకు తాతగా వారి శ్రేయస్సు, భద్రత నాకు ఎంతో ప్రాధాన్యం’’ అని ఆనంద్ మహీంద్రా ఈ టీషర్ట్ ఆవిష్కరణ వీడియోని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.