IMD: చల్లటి కబురు చెప్పిన భారత వాతావరణ విభాగం
- ఈ ఏడాది సాధారణ వర్షపాతానికే ఎక్కువ అవకాశాలు
- వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో సాధారణమే
- 96 శాతం నుంచి 104 శాతం మధ్య వర్షపాతం
- తాజా ప్రకటన విడుదల చేసిన ఐఎండీ
ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు పెద్దగా పడే అవకాశాలు తక్కువన్న ఆందోళనను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా ప్రకటనతో శాంతింపజేసింది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయిలో ఉండొచ్చంటూ తాజా అంచనాలను శుక్రవారం ప్రకటించింది. ‘‘దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం అధిక శాతం సాధారణ స్థాయిలో ఉండొచ్చు. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతం మధ్య నమోదు కావచ్చు. నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నాం. జూన్ 1లోపు రుతుపవనాలు వస్తాయని అనుకోవడం లేదు’’ అని ఐఎండీ ప్రకటించింది.
భారత్ లో ప్రాంతాల వారీ అంచనాలను గమనిస్తే.. దక్షిణ పీఠభూమి, మధ్య భారత్ లోని ప్రాంతాలు, ఈశాన్య భారత్ లో వర్షపాతం దీర్ఘకాల సగటు ఆధారంగా చూస్తే సాధారణ స్థాయిలోనే నమోదు కావచ్చు. అదే వాయవ్య భారత్ లోని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటులో 92 శాతం కంటే తక్కువే నమోదయ్యే అవకాశాలున్నాయి. మరింత సంతోషకరమైన విషయం ఏమిటంటే.. వర్షాధారితంగా సాగు చేసే అధిక ప్రాంతాల్లో వర్షపాతం దీర్ఘకాల సగటులో 94-106 శాతం మధ్య ఉంటుందని ఐఎండీ తెలిపింది. వచ్చే వారం అరేబియా సముద్రంలో తుపానుకు అవకాశం లేదని తేల్చేసింది. ‘‘వర్షపాతం విస్తరణ అంతటా సమానంగా ఉంటే వ్యవసాయంపై పెద్దగా ప్రభావం పడదు. వాయవ్య భారత్ లో ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదైంది’’ అని ఐఎండీ పేర్కొంది.