The Kerala Story: నిషేధం ఎత్తేసినా.. బెంగాల్లో ఒకే ఒక్క థియేటర్లో ప్రదర్శితమవుతున్న 'ది కేరళ స్టోరీ'
- మారుమూల ప్రాంతంలోని థియేటర్ కూ ప్రేక్షకుల క్యూ
- అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం
- బెంగాల్లో నిషేధం విధించిన సీఎం మమతా బెనర్జీ
- నిషేధాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ ఈ చిత్రం రూ. 200 కోట్ల కలెక్షన్లతో సూపర్ హిట్ గా మారింది. అయితే, ఈ చిత్రాన్ని బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. దీన్ని చిత్ర బృందం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణ తర్వాత నిషేధాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు తర్వాత కేరళ స్టోరీ చిత్రం బెంగాల్లో ఒకే ఒక్క థియేటర్లో ప్రదర్శితం అవుతోంది. అది కూడా భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని బొంగావ్ పట్టణంలోని శ్రీమా సినిమా హాల్ అనే థియేటర్లో నడుస్తోంది. ఇది కోల్కతాకు 75 కిలోమీటర్ల దూరంలోని బొంగావ్లోని రామ్నగర్ రోడ్డులో ఉంది.
ఇంత మారుమాల ప్రాంతంలోని థియేటర్ లో చూసేందుకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమాను నిషేధించిన తర్వాత దాదాపు 60 సినిమా హాళ్లు తమ స్లాట్లను ఇతర బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్ సినిమాలకు కేటాయించారు. ఈ ఒక్క సినిమా హాల్లో మాత్రమే కేరళ స్టోరీని ప్రదర్శిస్తున్నారని ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ సినిమాపై నిషేధం విధిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మే 8న ప్రకటించారు. దీనిని తెరపైకి తెస్తే మత కల్లోలాలు తలెత్తే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 'ది కేరళ స్టోరీ'ని దక్షిణాది రాష్ట్ర పరువు తీసే లక్ష్యంతో వక్రీకరించిన సినిమాగా మమత అభివర్ణించారు.