YS Avinash Reddy: ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన అవినాశ్ రెడ్డి న్యాయవాది
- అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ
- కొనసాగుతున్న వాదోపవాదాలు
- ఎఫ్ఐఆర్ నుంచి అన్ని పరిణామాలను కోర్టుకు వివరించిన అవినాశ్ న్యాయవాది
- గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్టు కాదని స్పష్టీకరణ
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. సీబీఐ అనుబంధ కౌంటర్ దాఖలు చేయగా, అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నుంచి, దర్యాప్తు, న్యాయస్థానాల్లో జరిగిన పరిణామాల వరకు హైకోర్టు ధర్మాసనానికి వివరించారు.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నిందితుడు అని రికార్డుల్లో సీబీఐ ఎక్కడా చెప్పలేదని న్యాయవాది ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్టే అనడం సరికాదని వాదించారు. కచ్చితంగా చెప్పడానికి అవినాశ్ రెడ్డి వైద్యుడో, పోలీస్ అధికారో కాదు కదా అని పేర్కొన్నారు.
"ఏ1 నిందితుడు గంగిరెడ్డికి వివేకానందరెడ్డితో భూ వివాదాలు ఉన్నాయి. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలకు వివేకాతో వజ్రాల వ్యాపారంలో విభేదాలు ఉన్నాయి. తమ కుటుంబ మహిళల విషయంలోనూ వారికి వివేకాపై కోపం ఉంది. వివేకా... డ్రైవర్ గా దస్తగిరిని తొలగించి ప్రసాద్ ను పనిలో పెట్టుకున్నాడు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అవినాశ్ రెడ్డే కారణమని వివేకానందరెడ్డి భావించారు. కానీ, వివేకా ఓటమికి కారణాలను సాక్షులే వివరించారు. స్థానిక నేతలు సహకరించకపోవడం వల్లే ఓడిపోయారని సాక్షులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు" అని న్యాయవాది ఉమామహేశ్వరరావు వివరించారు.
అటు, దస్తగిరి తీసుకున్న రూ.1 కోటిలో రూ.46.70 లక్షలే రికవరీ అయ్యాయని వెల్లడించారు. మిగతా సొమ్ము ఏమైందో సీబీఐ చెప్పడంలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ టికెట్ కోణాల్లో అవినాశ్ రెడ్డిని సీబీఐ అనుమానిస్తోందని హైకోర్టు ధర్మాసనానికి వివరించారు.
సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఐపీసీ 302 మాత్రమే నమోదు చేసిందని, సీబీఐ ఎఫ్ఐఆర్ లో 201 సెక్షన్ లేదని స్పష్టం చేశారు. అప్పటికే ఉన్న ఎఫ్ఐఆర్ ను యథాతథంగా నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. అందుకు సీబీఐ బదులిస్తూ, ఎఫ్ఐఆర్ ప్రకారమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొంది.
హత్య చేసిన దస్తగిరిని సీబీఐ వెనకేసుకొస్తోందని అవినాశ్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దస్తగిరి ముందస్తు బెయిల్ ను సీబీఐ వ్యతిరేకించకపోవడమే అందుకు నిదర్శనమని వివరించారు. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ పై వివేకా కుమార్తె సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, కానీ దస్తగిరి బయట తిరుగుతుంటే మాత్రం సునీత స్పందించడంలేదని ఆయన అన్నారు.