neelakantheswara temple: పుష్కరిణిలో స్వామికి అభిషేకం జరుగుతుంటే.. పక్కనే ఈత కొట్టిన ఆలయ ఈవో!
- దక్షిణ కాశీగా పేరు పొందిన నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయం
- స్వామి వారికి అర్చకులు అభిషేకం చేస్తుంటే.. పక్కనే జలకాలాడిన ఈవో వేణు
- పూజారులు చెప్పినా, భక్తులు వారించినా పట్టించుకోని వైనం
- అపచారం చేసిన ఈవోపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్
నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయం.. దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అలాంటి గుడికి ఈవోగా ఉన్న వ్యక్తి విచిత్ర చేష్టలకు దిగారు. నీలకంఠేశ్వర స్వామి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణిలో ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే వేణు ఈత కొడుతూ జలకాలాడారు.
స్వామి పూజ జరుగుతున్న సమయంలో అలా చేయొద్దని అర్చకులు ఈవోను వారించినా.. భక్తులు చెప్పినా.. ఆయన పట్టించుకోలేదు. ఓ వైపు అభిషేకం జరుగుతుండగానే.. దర్జాగా ఈత కొడుతూ స్నానం చేశారు. ఇదంతా అక్కడున్న ఓ భక్తుడు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేణు మొత్తం నాలుగు ఆలయాలకు ఇన్ చార్జ్ ఈవోగా పనిచేస్తున్నారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి జరగాల్సిన అన్ని సేవలు, కార్యక్రమాలను సజావుగా జరిపించాల్సిన, ఆలయాన్ని పరిరక్షించాల్సిన ఈవోనే ఈ విధంగా ప్రవర్తించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న అధికారి.. నీటిని అపవిత్రం చేసి, అపచారానికి పాల్పడ్డారని మండిపడుతున్నారు. వేణుపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.