YS Avinash Reddy: నోటీసులు ఇచ్చిన ప్రతిసారి అవినాశ్ రెడ్డి ఏదో ఒకటి చెబుతున్నారు: సునీత తరపు న్యాయవాది
- తెలంగాణ హైకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
- ఇవాళ సునీత వాదనలు వింటామని, రేపు సీబీఐ వాదనలు వింటామన్న హైకోర్టు
- వివేకా కుమార్తె సునీత తరఫున వాదిస్తున్న ఎల్.రవిచందర్
ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వివేకా కుమార్తె సునీత తరఫున న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తున్నారు. సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ అవినాశ్ రెడ్డి ఏదో ఒక కారణం చెబుతున్నారని రవిచందర్ ఆరోపించారు. మొదట్లో పార్లమెంటు సమావేశాల వల్ల విచారణకు రాలేనన్నారని, రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారని వెల్లడించారు.
ఆ తర్వాత నోటిసులు ఇచ్చినప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని సునీత న్యాయవాది వివరించారు. ఇప్పుడు తల్లికి అనారోగ్యం అంటున్నారని పేర్కొన్నారు. తననెందుకు అరెస్ట్ చేయలేదని అవినాశ్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
కాగా, నేటి విచారణ సందర్భంగా వాదనలకు ఎంత సమయం కావాలని సీబీఐ, సునీత న్యాయవాదులను హైకోర్టు జడ్జి అడిగారు. చెరో గంట సమయం కావాలని వారు బదులిచ్చారు. దాంతో, ఇవాళ సునీత వాదనలు వింటామని, రేపు సీబీఐ వాదనలు వింటామని జడ్జి పేర్కొన్నారు.
అంతకుముందు, అవినాశ్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అవినాశ్ తల్లి ఆసుపత్రిలో ఉండగానే సీబీఐ ఎందుకంత హడావిడి చేస్తోందని అన్నారు.