K.Vasu: టాలీవుడ్ లో మరో విషాదం... దర్శకుడు కె.వాసు కన్నుమూత
- సీనియర్ దర్శకుడు కె.వాసు హైదరాబాదులో మృతి
- కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.వాసు
- చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన వైనం
సీనియర్ దర్శకుడు కె.వాసు కన్నుమూశారు. ఆయన గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇటీవల నటుడు శరత్ బాబు మరణంతో విషాదంలో ఉన్న చిత్ర పరిశ్రమను కె.వాసు మరణం మరింత విషాదానికి గురిచేసింది.
దర్శకుడిగా కె.వాసు తొలి చిత్రం ఆడపిల్లల తండ్రి. చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు కె.వాసు దర్శకత్వంలోనే వచ్చింది. అయ్యప్పస్వామి మహత్మ్యం, శ్రీ షిర్డీసాయిబాబా మహత్మ్యం వంటి ఆధ్యాత్మిక చిత్రాలతోనూ ఆయన హిట్స్ అందుకున్నారు.
దర్శకుడిగా కె.వాసు చివరి చిత్రం గజిబిజి. ఈ చిత్రం 2008లో విడుదలైంది. ఆడపిల్ల, పుట్టినిల్లా మెట్టినిల్లా వంటి చిత్రాలతో సెంటిమెంట్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కె.వాసు తెలుగు చిత్రసీమ సీనియర్ దర్శకుడు కె.ప్రత్యగాత్మ కుమారుడు. ఆయన బాబాయి హేమాంబరధరరావు కూడా దర్శకుడే. తండ్రి, బాబాయిల బాటలో కె.వాసు కూడా చిత్రసీమలో అడుగుపెట్టారు. కృష్ణా జిల్లా ముదునూరు ఆయన స్వస్థలం.