Kerala: హోటల్ యజమానిని కిరాతకంగా చంపిన యువజంట.. హనీట్రాప్‌పై అనుమానాలు
- మృతదేహాన్ని ముక్కలుగా కోసి ట్రావెల్ బ్యాగులో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో పడేసిన వైనం
- అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ. లక్ష డ్రా కావడంతో అనుమానించిన కుమారుడు
- పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి
- చెన్నైలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేరళలో ఓ యువ జంట కిరాతకానికి తెగబడింది. ఓ హోటల్ యజమానిని అత్యంత దారుణంగా హతమార్చి ఆపై ముక్కలు చేసి వాటిని ట్రావెల్ బ్యాగులో తీసుకెళ్లి అడవిలో పడేసింది. సంచలనం సృష్టించిన ఈ కేసులోని నిందితులను చెన్నైలో అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న వారిని కేరళ పోలీసులకు అప్పగించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మళప్పురంలోని ఎళూర్ మేచేరికి చెందిన 58 ఏళ్ల సిద్ధిఖ్ హోటల్ యజమాని. ఈ నెల 18న ఆయన ఎరంజీపాలెంలో ఉన్న ఓ హోటల్లోని బి3, బి4 గదులను బుక్ చేసుకున్నారు. అదే హోటల్‌లో పాలక్కాడ్‌కు చెందిన శిబిల్ (22), ఫర్హానా (18) దిగారు. మే 19న శిబిల్, ఫర్హానా ఓ ట్రాలీబ్యాగుతో హోటల్ నుంచి కిందికి వస్తున్న దృశ్యాలు హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాతి నుంచి వీరిద్దరితోపాటు సిద్ధిఖ్ జాడ కూడా మాయమైంది.
మరోవైపు, సిద్ధిఖ్‌కు అతడి కుమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. దీనికి తోడు ఆయన లక్ష రూపాయలు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో ఏదో జరిగిందని అనుమానించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన శిబిల్ గతంలో సిద్ధిఖ్ హోటల్‌లో పనిచేసినట్టు విచారణలో తేలింది. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో సిద్ధిఖ్ అతడిని పని నుంచి తొలగించారు. హత్యకు ఇదే కారణమా? లేక హనీట్రాప్ చేసి ఆయనను హతమార్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఫర్హానా స్నేహితుడు ఆషిఖ్ అనే మూడో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.