RSS: అలా చేస్తే కాంగ్రెస్ కాలి బూడిదవుతుంది: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి వార్నింగ్
- రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగిస్తే ఆర్ఎస్ఎస్, బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే
- ఆయన వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్
- ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్
కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్‌దళ్‌పై నిషేధం విధించాలంటూ ఆ రాష్ట్ర నూతన మంత్రి ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఆ రెండు సంస్థలపై నిషేధం విధించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పందించారు. బజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ కాలి బూడిద అవుతుందని నళిన్ కటీల్ హెచ్చరించారు.
‘ప్రియాంక్ ఖర్గే ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడం గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ గా పనిచేసి ఇప్పుడు కీలక స్థానంలో ఉన్నారు. మేమంతా ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులం. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, నరసింహారావు ప్రభుత్వాలు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించడానికి ప్రయత్నించాయి. కానీ, అవి విజయం సాధించలేకపోయాయి. బజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్‌లను నిషేధించేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ కాలి బూడిద అవుతుంది. ప్రియాంక్ ఖర్గే దేశ చరిత్ర గురించి తెలుసుకోవడం మంచిది. ఏదైనా మాట్లాడేముందు వెనకాముందు ఆలోచించుకోవాలి’ అని నళిన్ కటీల్ అన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడైన ప్రియాంక్ ఖర్గే ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిత్తాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కొత్త క్యాబినెట్ లో ఆయనకు మంత్రి పదవి లభించింది. నైతిక పోలీసింగ్‌కు పాల్పడే సంస్థలను నిషేధించడానికి తాము వెనుకాడబోమని ఆయన చెప్పారు.