USA: దీపావళిని దేశవ్యాప్త సెలవుగా ప్రకటించేందుకు అమెరికాలో బిల్లు
- అమెరికా ప్రతినిధుల సభలో తాజాగా బిల్లును ప్రవేశపెట్టిన రిప్రజెంటేటివ్ గ్రేస్ మెంగ్
- అమెరికన్లలో దీపావళిపై అవగాహన పెంచేందుకే ఈ బిల్లు అని వెల్లడి
- గ్రేస్ బిల్లుపై సర్వత్రా హర్షం
- ఇది చారిత్రక బిల్లు అన్న న్యూయార్క అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్
అమెరికాలో దీపావళిని దేశవ్యాప్త సెలవుగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మేంగ్ ప్రతినిధుల సభలో ‘దివాళి డే యాక్ట్’ పేరిట తాజాగా ఓ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై అమెరికాలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ప్రపంచంలోని కోట్లాది మందికి దీపావళి ఎంతో ముఖ్యమైన పర్వదినం. అమెరికాలోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ పండుగ జరుపుకుంటాయి’’ అని మేంగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ‘‘ఈ రోజుకున్న ప్రాముఖ్యతపై అమెరికన్లలో అవగాహన పెంచేందుకు తొలి అడుగుగా ఈ బిల్లును సిద్ధంగా చేశాను’’ అని ఆమె తెలిపారు.
ఈ బిల్లుపై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘దీపావళి ప్రాముఖ్యాన్ని, దక్షిణాసియా వారిని గుర్తిస్తూ ఓ రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఏకతాటిపైకి రావడం మనం చూశాం. ఈ స్ఫూర్తిని కాంగ్రెస్ సభ్యురాలు మెంగ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దీపావళిని జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారు’’ అని కొనియాడారు.
న్యూయార్క్ స్టేట్ సెనేటర్ జెరెమీ కూనీ కూడా మెంగ్‌ను ప్రశంసించారు. ‘‘దీపావళిని సెలవుగా ప్రకటిస్తే ఈ పండుగ నిర్వహించుకునే వారిని గౌరవించినట్టు అవుతుంది. అంతేకాకుండా, అమెరికన్లకు పెద్ద సంప్రదాయానికి ప్రచారం కల్పించినట్టు అవుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఆమోదిస్తే అధ్యక్షుడు ఆమోదముద్ర వేస్తారు. దీంతో, దీపావళికి అమెరికాలో 12వ దేశవ్యాప్త హాలిడేగా గుర్తింపు దక్కుతుంది. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం కోసం గట్టి కృషి చేస్తానని బిల్లును ప్రతిపాదించిన గ్రేస్ మెంగ్ పేర్కొన్నారు.