banks: రూ.2,000 నోట్లను మార్చేందుకు ఐడీ ప్రూఫ్ అడుగుతున్న బ్యాంకులు!
- సొంత కస్టమర్లు అయితే ఖాతా నంబర్ వివరాలు ఇవ్వాల్సిందే
- వేేరే బ్యాంక్ కస్టమర్లు గుర్తింపు పత్రం, దరఖాస్తు పత్రం సమర్పించాలి
- కస్టమర్ సోర్స్ తెలుసునేందుకు బ్యాంకుల్లో ఆసక్తి
ఆర్ బీఐ రూ.2,000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించి, ప్రజలు తమ దగ్గరున్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని, లేదంటే మార్చుకోవాలని కోరింది. దీంతో అన్ని బ్యాంకుల్లోనూ నోట్ల డిపాజిట్, మార్పిడి కార్యక్రమం మొదలైంది. అధిక శాతం ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులు కాకుండా, రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు వచ్చే ఇతరుల నుంచి గుర్తింపు ఐడీ వివరాలను తీసుకుంటున్నాయి. ఒకవేళ అదే బ్యాంకు కస్టమర్ అయినా సరే, నోట్ల మార్పిడి సమయంలో ఖాతా నంబర్ వివరాలు తీసుకుంటున్నాయి.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి వచ్చే ప్రతీ కస్టమర్ నుంచి అనెక్స్యూర్ - 1 ఫామ్ ఇవ్వాలని కోరుతోంది. బ్యాంకు కస్టమర్ అయినా, వేరే బ్యాంక్ కస్టమర్ అయినా ఇదే విధానం పాటిస్తోంది. పేరు, మొబైల్ నంబర్, ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ లేదా పాస్ పోర్ట్ లేదా పాన్ తదితర వివరాలను తీసుకుంటోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ.2,000 నోట్ల మార్పిడికి వచ్చే ప్రతి కస్టమర్ నుంచి దరఖాస్తు అడుగుతోంది. పేరు, పూర్తి చిరునామా, కాంటాక్ట్ నంబర్ కు తోడు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ తదితర ఏదైనీ ఒక గుర్తింపు వివరాలు అడుగుతోంది. బ్యాంకు కస్టమర్లు అయితే సీఆర్ఎన్ నంబర్ తీసుకుంటోంది. ఇండస్ ఇండ్ బ్యాంకు సైతం ఇదే మాదిరి వివరాలు అడుగుతోంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎలాంటి ప్రత్యేక దరఖాస్తు పత్రం నింపాలని కోరడం లేదు. ఇతర బ్యాంకు కస్టమర్లు అయితే క్యాష్ డిపాజిట్ స్లిప్ ను నింపి ఇవ్వాలని కోరుతోంది. దీనికి తోడు కాంటాక్ట్ వివరాలు, గుర్తింపు కార్డ్ వివరాలు అడుగుతోంది. ఇక పీఎన్ బీ, ఎస్ బీఐ సొంత కస్టమర్లు అయితే ఖాతా నంబర్ ఒకటి తీసుకుంటున్నాయి. ఇతర బ్యాంకు కస్టమర్ అయితే ఏదైనా గుర్తింపు ఆధారాన్ని ఇవ్వాలని కోరుతోంది.