Couple: ఉత్తర కొరియాలో బైబిల్ తో పట్టుబడ్డ దంపతులకు మరణశిక్ష... చిన్నారికి జీవితఖైదు
- ఉత్తర కొరియాలో క్రైస్తవులకు మృత్యుఘంటికలు
- బైబిల్ తో దొరికిపోతే చావే గతి
- చిన్నారులు, ఇతర కుటుంబ సభ్యులకు జీవితఖైదు
- కిమ్ క్రూరత్వానికి నిదర్శనంగా అక్కడి చట్టాలు
ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ కిరాతక పాలన గురించి చెప్పేందుకు ఇది సరైన ఉదాహరణ. బైబిల్ తో పట్టుబడిన దంపతులకు మరణశిక్ష విధించిన ఉత్తర కొరియా ప్రభుత్వం... ఆ దంపతుల చిన్నారిబిడ్డకు జీవితఖైదు విధించింది. ఆ చిన్నారి వయసు రెండేళ్లే. ఈ విషయం అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడైంది.
బైబిల్ తో దొరికితే భార్యాభర్తలకు మరణశిక్ష తప్పనిసరి అని, వారి పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు జీవితఖైదు విధిస్తారని ఆ నివేదికలో వివరించారు. కిమ్ క్రూరత్వానికి అక్కడి చట్టాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఉత్తర కొరియాలో క్రైస్తవ మతం అవలంబించేవారి పట్ల కిమ్ సర్కారు మృత్యు ఘంటికలు మోగిస్తోంది. అంతేకాదు, వారి కుటుంబసభ్యులను తీసుకెళ్లి ఓ జైలు వంటి శిబిరంలో నిర్బంధిస్తున్నారు. వారక్కడ జీవితఖైదు అనుభవించాల్సిందే. ఈ విధంగా క్రైస్తవం సహా పలు మతాలకు చెందినవారు 70 వేల మంది వరకు జీవితఖైదు అనుభవిస్తున్నారట.
ఉత్తర కొరియాలో 70.9 శాతం మంది నాస్తికులు కాగా... 11 శాతం మంది బౌద్ధమతాన్ని, 1.7 శాతం మంది ఇతర మతాలను అనుసరిస్తున్నారని, 16.5 శాతం మంది ఏ మతం అనుసరిస్తున్నారో తెలియదని 2015 నాటి నివేదిక చెబుతోంది.