Jagan: నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ప్రగతిపై నివేదిక సమర్పించిన సీఎం జగన్
- ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం జగన్
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ అని ఉద్ఘాటన
- పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.13 లక్షల కోట్లు తెచ్చామని వెల్లడి
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రగతిపై నివేదికను సమర్పించారు. దేశంలో లాజిస్టిక్స్ పై భారీ వ్యయం చేస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. సరకు రవాణా కారిడార్లు, హైవేలపై ఎక్కువగా ఖర్చు పెడుతుండడం ప్రశంసనీయం అని పేర్కొన్నారు.
జీడీపీ పెరుగుదలతో సేవలు, తయారీ రంగాలు కీలకం అని వివరించారు. వ్యవసాయ ఉత్పాదకతకు కొత్త సాంకేతికత జత చేయాల్సి ఉందని సూచించారు.
ఏపీలో కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. పీపీపీ కింద అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నిర్మిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా ఏపీనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.13 లక్షల కోట్లు వచ్చాయని సీఎం జగన్ తెలిపారు.
వైద్యరంగంలో కీలక సంస్కరణలు చేశామని, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ పథకాలు తీసుకువచ్చామని వివరించారు. కాలానుగుణంగా విద్యార్థులకు డైనమిక్ రీతిలో విద్యాబోధన కొనసాగాలని ఆకాంక్షించారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మహిళల ఆర్థిక ప్రగతికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా కృషి చేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని జగన్ పిలుపునిచ్చారు.