Rajendra Prasad: ఎన్టీఆర్ జీవించి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడిని: రాజేంద్రప్రసాద్
- ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళి
- ఎన్టీఆర్ పుట్టిన నేలపై జన్మించడం అదృష్టమన్న రాజేంద్ర ప్రసాద్
- ఎన్టీఆర్ తనకు గురువు, దైవమన్న నటుడు
- కుల ప్రస్థావన తీసుకొస్తే కోప్పడేవారన్న రాజేంద్రప్రసాద్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగునేల గర్వించదగిన నటుడు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ ఉదయం నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఘాట్‌కు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. కాసేపటి క్రితం సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పుట్టిన నేలపై జన్మించడం అదృష్టమన్నారు. ఎన్టీఆర్ ఉండి ఉంటే ఆయనకు బంగారు పూలతో పాదపూజ చేసే వాడినని పేర్కొన్నారు. ఎన్టీఆర్ తనకు గురువు, దైవమని, ప్రజలనే దేవుళ్లుగా భావించారని అన్నారు. ఆయనను అలాగే చూశానని, ఎన్టీఆర్ వద్ద కుల ప్రస్థావన తీసుకొస్తే చాలా కోప్పడేవారని గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారని తెలిసి ఆనందపడ్డానని తెలిపారు. ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.