Rajya Sabha deputy chairman: ముఖ్యమైన మైలు రాయిని చేరుకున్నాం: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
- కొత్త పార్లమెంటులో ప్రసంగించిన హరివంశ్ సింగ్
- మోదీ నాయకత్వంలో 2.5 ఏళ్లలోనే పార్లమెంట్ నిర్మించినట్లు వెల్లడి
- రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పంపిన సందేశాలను చదివి వినిపించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2.5 ఏళ్లలోనే కొత్త, ఆధునిక పార్లమెంట్‌ను నిర్మించడం చాలా సంతోషకరమైన విషయమని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నామని చెప్పారు. ఈ అమృతకాలంలో స్ఫూర్తిదాయకంగా ఇది నిలుస్తుందని అన్నారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ సందేశాలను చదివి వినిపించారు
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులోకి రాగా.. సభ్యులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. లోక్ సభ చాంబర్ లోకి వస్తున్న ఆయనకు లేచి నిలబడి ఎంపీలందరూ ఆహ్వానించారు. వారికి నమస్కరిస్తూ ప్రధాని ముందుకు కదిలారు. ఆయన వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ తదితరులు ఉన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ తదితరులు, ఏపీ సీఎం జగన్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.