Asaduddin Owaisi: ఆర్జేడీ ‘శవపేటిక’ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్.. కొత్త పార్లమెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆర్జేడీకి స్టాండ్ అంటూ ఏదీ ఉండదన్న ఒవైసీ
- పార్లమెంటును శవపేటిక అని ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్న
- ఇంకేమైనా మాట్లాడి ఉండొచ్చని వ్యాఖ్య
- కొత్త పార్లమెంటును స్పీకర్ ప్రారంభించాల్సిందన్న ఎంఐఎం చీఫ్
కొత్త పార్లమెంట్ భవనం శవపేటికలా ఉందంటూ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘వాళ్లు (ఆర్జేడీ) పార్లమెంటును శవపేటిక అని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్లు ఇంకేమైనా మాట్లాడి ఉండొచ్చు. ఇంకేదైనా ఉదాహరణ చెప్పి ఉండొచ్చు. ఈ యాంగిల్ ఎందుకు తీసుకురావాలి?’’ అని ప్రశ్నించారు.
ఆర్జేడీకి స్టాండ్ అంటూ ఏదీ లేదని ఎద్దేవా చేశారు. కొన్నిసార్లు వాళ్లు లౌకికవాదం గురించి చెబుతారని, మరికొన్ని సార్లు బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటికి వచ్చిన నితీశ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తారని మండిపడ్డారు.
ఇదే సమయంలో పాత పార్లమెంటు భవనంపైనా ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ కూడా లేదని చెప్పారు. కొత్త పార్లమెంటు భవనాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ప్రచారం కోసం ప్రధాని ప్రారంభిస్తున్నారని విమర్శించారు.