Narendra Modi: 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక.. కొత్త పార్లమెంట్ పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు
- భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్న ప్రధాని
- భారతదేశం.. ప్రజాస్వామ్యానికి తల్లి అని, ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది అని వ్యాఖ్య
- పవిత్రమైన సెంగోల్ ను పార్లమెంట్ లో ప్రతిష్ఠించామని వెల్లడి
- భవిష్యత్ లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని, కొత్త పార్లమెంటును నిర్మించాల్సిన పని పడిందని వివరణ
- రూ.75 నాణెం, స్టాంప్ ను రిలీజ్ చేసిన మోదీ
భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్ నిర్మించుకున్నామని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు. ఈ రోజు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం తర్వాత లోక్ సభలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్ సభ స్పీకర్ తర్వాత ప్రధాని ప్రసంగించారు.
ఈ భవనం నిర్మాణంతో 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని మోదీ చెప్పారు. కొత్త పార్లమెంట్.. కొత్త భారత్ కు కొత్త జోష్ తీసుకువచ్చిందన్నారు. ‘‘ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక’’ అని చెప్పారు. భారతదేశ సంకల్పం గురించి ప్రపంచానికి సందేశాన్ని ఇస్తుందని అన్నారు.
ఆధునిక భారత్ కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతోందని మోదీ చెప్పారు. పవిత్రమైన సెంగోల్ (రాజదండం) ను పార్లమెంట్ లో ప్రతిష్ఠించామని చెప్పారు. సేవ, కర్తవ్యానికి సెంగోల్ ప్రతీక అని వెల్లడించారు. చోళ సామ్రాజ్య చరిత్రలో సెంగోల్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని వెల్లడించారు.
ప్రతి దేశ అభివృద్ధి ప్రయాణంలో కొన్ని క్షణాలు అజరామరంగా మారతాయని, మే 28 కూడా అలాంటి రోజు అని ప్రధాని అన్నారు. ‘‘భారతదేశం.. ప్రజాస్వామ్యానికి తల్లి. ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది కూడా. ప్రజాస్వామ్యమే మన ఆలోచన, సంప్రదాయం’’ అని తెలిపారు. ఎన్నో ఏళ్ల విదేశీ పాలన మన ఆత్మగౌరవాన్ని మన నుంచి దొంగిలించిందని, నేడు భారతదేశం ఆ వలసవాద మనస్తత్వాన్ని వదిలివేసిందని అన్నారు.
‘‘మనకు కొత్త పార్లమెంటు అవసరం ఉంది. రాబోయే కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మనం గుర్తించాలి. అందుకే కొత్త పార్లమెంటును నిర్మించాల్సిన పని పడింది’’ అని ప్రధాని అన్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత పలువురు నేతలతో ప్రధాని ముచ్చటించారు. దేవెగౌడ తదితరుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. అంతకుముందు రూ.75 నాణెం, స్టాంప్ ను రిలీజ్ చేశారు.