Narendra Modi: ఎన్టీఆర్ కు ప్రధాని మోదీ నివాళి.. ‘మన్ కీ బాత్’ లో ప్రస్తావన
- ఎన్టీఆర్ కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారన్న ప్రధాని
- రాజకీయాలు, చలన చిత్ర రంగంలో తన ప్రతిభతో చెరగని ముద్ర వేశారని వ్యాఖ్య
- రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనను జనం ఇప్పటికీ స్మరిస్తారని ప్రశంసలు
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. కోట్లాది ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ స్థానం సంపాదించారని అన్నారు. రాజకీయాలు, చలన చిత్ర రంగంలో తన ప్రతిభతో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆదివారం 101వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.
తన నటనా కౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్ జీవం పోశారని మోదీ చెప్పారు. ‘‘బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీరంగంలో ఖ్యాతిగాంచారు. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనను జనం ఇప్పటికీ స్మరిస్తారు’’ అని మోదీ గుర్తు చేశారు.
మరోవైపు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించారు. సావర్కర్‌ను ఖైదు చేసిన అండమాన్‌లోని కాలాపానీ జైలును సందర్శించిన రోజును తాను మర్చిపోలేనని చెప్పారు. నిర్భయంగా, ఆత్మగౌరవంగా వ్యవహరించే సావర్కర్ శైలి బానిసత్వాన్ని ఎన్నటికీ అంగీకరించదని పేర్కొన్నారు.