Telugu Heritage Day: చార్లోటే నగరం నేడు 'తెలుగు హెరిటేజ్ డే'గా పాటించడం అందరికీ గర్వకారణం: చంద్రబాబు
- తెలుగుకు విశిష్ట గుర్తింపు
- ఇవాళ ఎన్టీఆర్ శతజయంతి
- తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించిన చార్లోటే నగర మేయర్
- సర్టిఫికెట్ ను పంచుకున్న చంద్రబాబు
ఇవాళ మే 28న ఎన్టీఆర్ శతజయంతి వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర అంశం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అత్యంత గర్వకారణమైన విషయం అని తెలిపారు. అమెరికాలోని చార్లోటే నగరం మే 28వ తేదీని తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించిందని వివరించారు. ఎన్టీఆర్ వంటి మహనీయుడు పుట్టినరోజు కూడా ఇవాళే కావడం కాకతాళీయం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు చార్లోటే నగర మేయర్ అలెగ్జాండర్ లైల్స్ సంతకంతో కూడిన ప్రొక్లమేషన్ సర్టిఫికెట్ ను కూడా పంచుకున్నారు.
తెలుగు ప్రపంచంలోనే అత్యంత చారిత్రక, సుదీర్ఘకాలంగా మనుగడలో ఉన్న భాష అని, ఇది క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం నాటిదని ఆ సర్టిఫికెట్ లో పేర్కొన్నారు. భారత కేంద్ర ప్రభుత్వం వర్గీకరించిన 6 శాస్త్రీయ భాషల్లో తెలుగు కూడా ఉందని తెలిపారు.
భారత్ లో తెలుగు భాషను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాట్లాడతారని, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నారని పేర్కొన్నారు.
2018 నాటి నివేదిక ప్రకారం అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు అని, అమెరికా వ్యాప్తంగా తెలుగు సమాజాలు విస్తరించాయని, చార్లోటే నగరంలోనూ తెలుగు వారు నివసిస్తున్నారని ఆ సర్టిఫికెట్ లో వివరించారు.
తెలుగు మాట్లాడే ప్రజలు టెక్నాలజీ, వైద్యం, ఇంజినీరింగ్ తదితర అనేక రంగాల్లో సత్తా చాటుతున్నారని కొనియాడారు.