Kamal Haasan: నేనప్పుడే చెప్పా..కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు.. ఓటీటీలపై కమలహాసన్
- గతంలో ఓటీటీ వ్యవస్థ కోసం ప్రణాళిక సిద్ధం చేశానన్న కమల్
- సినిమా పరిశ్రమలోని వారంతా తన మాటలను పట్టించుకోలేదని వ్యాఖ్య
- ఇప్పుడు వారికి విషయం అర్థమైందని వెల్లడి
కరోనా తర్వాత ఓటీటీ ట్రెండ్ జోరందుకుంది. కేవలం వాటి కోసమే వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ఓటీటీ గురించి తమిళ స్టార్ హీరో కమల హాసన్ దాదాపు పదేళ్ల కిందటే ఆలోచించారు. తన సినిమాను నేరుగా కొంత రుసుముతో టీవీల్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో కమలహాసన్ మాట్లాడుతూ, ‘‘ఓటీటీ వ్యవస్థ వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను. దీని కోసం ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశాను. కానీ ఆ సమయంలో సినిమా పరిశ్రమలోని వారంతా నా మాటలను పట్టించుకోలేదు. నా ఆలోచనలను అంగీకరించలేదు. కానీ ఈ రోజు వారికి అర్థమైంది’’ అని అన్నారు.
ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కడి నుంచైనా అన్ని భాషల్లోని సినిమాలను చూస్తున్నారని చెప్పారు. తాను చిన్న సినిమాలకు వీరాభిమానినని, అలాంటి సినిమాలు చేసే పెద్ద స్టార్ అయ్యానని తెలిపారు. ‘‘కథలు విన్నప్పుడు కొన్నింటిలో నటించాలనుకుంటాను. మరికొన్నింటిని నిర్మించాలనుకుంటాను. ప్రస్తుతం కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. కేవలం నిర్మాతగానే ఉంటాను. వాటి గురించి మిగతా విషయాలు పట్టించుకోను’’ అని చెప్పుకొచ్చారు.
ఓటీటీ గురించి 2013లోనే కమల హాసన్ ఆలోచించారు. ‘విశ్వరూపం’ సినిమాను ఓటీటీ తరహాలో డబ్బు చెల్లించి ఇంట్లో కూర్చొని చూసేలా ఏర్పాటు చేయాలని అప్పట్లోనే ప్రయత్నించారు. కానీ థియేటర్ల యాజమాన్యాలు, కొందరు సినీ ప్రముఖులు దీన్ని వ్యతిరేకించడంతో ఈ డైరెక్ట్-టు-హోమ్ ప్రోగ్రామ్‌ను పక్కన పెట్టారు.
మరోవైపు ఆరు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్నందుకు గాను కమల్‌ను ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం వరించింది. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్2’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.