Botsa Satyanarayana: పేదవాళ్లను ధనికులను చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు అప్పుడెందుకు రాలేదో!: బొత్స
- నిన్న టీడీపీ మహానాడులో మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు
- పూర్ టు రిచ్ అనే అంశంపై వివరణ
- కనీసం కుప్పంలో పాఠశాలను బాగుచేయలేకపోయావంటూ బొత్స విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న ప్రకటించిన మేనిఫెస్టోలో 'పూర్ టు రిచ్' అనే అంశాన్ని ప్రస్తావించడం తెలిసిందే. పేదవాళ్లను కూడా ధనికులను చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాత్మకంగా స్పందించారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు... అప్పుడెందుకు పేదవాళ్లను ధనికులుగా చేయాలనే ఆలోచన రాలేదు? అని చంద్రబాబును ప్రశ్నించారు. కనీసం కుప్పంలో ప్రభుత్వ పాఠశాలను బాగుచేయలేకపోయావు అంటూ విమర్శించారు.
రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేసిన నాయకుడు జగన్ అని బొత్స వెల్లడించారు. 'ఈ నాలుగేళ్లలో కేవలం విద్యారంగంపై రూ.60 వేల కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందిస్తున్నారు... ఇదీ విజన్ అంటే" అని చంద్రబాబును ఎత్తిపొడిచారు.