tadepalli: ప్రభుత్వం న్యాయం చేయడం లేదంటూ ముగ్గురి ఆత్మహత్యాయత్నం.. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసు ఎదుట ఘటన
- విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ట్రైనర్లను నియమించిన గత ప్రభుత్వం
- 2021 మేలో 854 మందిని సర్కారు తొలగించిందన్న ట్రైనర్లు
- తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రెండేళ్లుగా ఆందోళనలు
- కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగిన ముగ్గురు ట్రైనర్లు
గతంలో నైపుణ్య వికాసం ప్రాజెక్టులో పని చేసిన ముగ్గురు ట్రైనర్లు.. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయడం లేదన్న ఆవేదనతో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగారు. వారిని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2021 మేలో 854 మందిని తొలగించారని ట్రైనర్లు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం గత ప్రభుత్వం నియమిస్తే తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ట్రైనర్లు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. 854 మంది ట్రైనర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.
పని చేసిన కాలంలో 6 నెలల పెండింగ్ వేతనం కూడా చెల్లించడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చి విస్మరించారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని.. ప్రభుత్వం ఆదుకోవాలని ట్రైనర్లు కోరారు.