Margadarshi: మార్గదర్శి కేసు... రూ.793 కోట్లు అటాచ్ చేసిన ఏపీ సీఐడీ
- మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు
- భారీగా ఆస్తులను అటాచ్ చేసిన వైనం
- ఇటీవలే రామోజీరావు, శైలజా కిరణ్ లను విచారించిన సీఐడీ
- పలువురు మార్గదర్శి మేనేజర్ల అరెస్ట్
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. చిట్ ఫండ్ సంస్థలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈమేరకు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నుంచి రూ.793 కోట్ల నగదును అటాచ్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. మార్గదర్శి కేసు దర్యాప్తులో ఇది కీలక పరిణామంగా భావించవచ్చు.
ఇటీవల మార్గదర్శి కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్ లను విచారించారు. ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ అరెస్ట్ చేయడం తెలిసిందే.
చిట్ ఫండ్ చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించి, నిధులను దారి మళ్లించారన్నది రామోజీరావు తదితరులపై ప్రధాన ఆరోపణ. చిట్స్ ద్వారా వసూలైన డబ్బును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ కు బదలాయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో సీఐడీ రామోజీరావును ఏ-1గా, ఆయన కోడలు శైలజా కిరణ్ ను ఏ-2గా పేర్కొంది. అనేకమంది మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదయ్యాయి.