PM Modi: ఈ తొమ్మిదేళ్లలో ప్రతి నిర్ణయం ప్రజల కోసమే: ప్రధాని మోదీ

 PM Modis Tweet on 9 Years Of BJP Government

  • నాలుగేళ్ల కిందట ఇదే రోజున రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ
  • తన పదవీ కాలాన్ని సేవగా అభివర్ణించిన ప్రధాని
  • అభివృద్ధి చెందిన భారతం కోసం మరింత కష్టపడి పని చేస్తామని ట్వీట్ 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈ రోజుతో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. నాలుగేళ్ల కిందట ఇదే రోజున రెండో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ తొమ్మిదేళ్లలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసమేనని చెప్పారు. తన పదవీ కాలాన్ని తొమ్మిదేళ్ల సేవగా ఆయన అభివర్ణించారు.

‘‘దేశ సేవలో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో నేనెంతో కృతజ్ఞతా భావంతో ఉన్నాను. ఇన్ని సంవత్సరాల్లో ప్రతి నిర్ణయం, ప్రతి చర్య.. ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో తీసుకున్నవే. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ఇంతకంటే ఎక్కువగా కష్టపడి పని చేస్తాం’ అని మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ‘స్పెషల్ కాంటాక్ట్ క్యాంపెయిన్’ను నెల రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. ‘నేషన్ ఫస్ట్‌’ అనే నినాదంతో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని బీజేపీ ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది.

2014 ఎన్నికల్లో 282 సీట్లతో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తంగా ఎన్డీయే కూటమి 336 స్థానాలను కైవసం చేసుకుంది. మే 26న తొలిసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 303 చోట్ల గెలిచింది. ఎన్డీయే 353 సీట్లను సాధించింది. మే 30న వరుసగా రెండోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News