Hyderabad: ట్యాంక్‌బండ్‌పై చెత్త... పర్యాటకులకు వీడియో ద్వారా కేటీఆర్ విజ్ఞప్తి
- ట్యాంక్ బండ్ ను అపరిశుభ్రంగా తయారు చేస్తోన్న పర్యాటకులు
- కేకులు, ఇతర తినుబండారాల వ్యర్థాలను పడేస్తున్న వైనం
- నగరానికి మణిహారమైన ట్యాంక్ బండ్ ను శుభ్రంగా ఉంచాలని కేటీఆర్
భాగ్యనగరంలోని ట్యాంక్ బండ్ ను పర్యాటకులు అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారు.
రాత్రి వేళల్లో తినుబండారాలకు సంబంధిన పదార్థాలను, కేకులను ఇతరత్రా వ్యర్థాలను అక్కడే ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారడంతో పాటు ఉదయం వాకింగ్ కోసం, ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చే వారికి ఇబ్బందిని కలిగిస్తోంది. ఈ విషయం ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి వచ్చింది. దీనిపై ఐటీ శాఖమంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చారు.
'మహానగరానికి మణిహారం ట్యాంక్‌బండ్!
శతాబ్దాల ఘన చరిత్రకు ప్రతీక ట్యాంక్‌బండ్!
అందుకు తగ్గట్టే... ట్యాంక్‌బండ్ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈ విశిష్ట నిర్మాణానికి మరిన్ని మెరుగులు అద్ది... ట్యాంక్‌బండ్ ను అత్యంత అందంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం.
నగర ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్న ట్యాంక్‌బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడటం మనందరి బాధ్యత.
మనం నివసించే ఇంటిలాగానే మనకు గర్వకారణం అయిన పర్యాటక ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను' అంటూ పేర్కొన్నారు.