Jogi Ramesh: శతకోటి వాగ్దానాలు ఇచ్చినా చంద్రబాబును ప్రజలు నమ్మరు: మంత్రి జోగి రమేశ్
- రాజమండ్రి మహానాడులో మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు
- రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అన్న జోగి రమేశ్
- 650 హామీలు ఇచ్చి 10 కూడా అమలు చేయలేదని ఆరోపణ
ఇటీవల రాజమండ్రి మహానాడు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి విడత మేనిఫెస్టో ప్రకటించడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శతకోటి వాగ్దానాలు చేసినా టీడీపీని, చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మబోరని అన్నారు.
మురికిపట్టిన చంద్రబాబును ప్రజలు ఎంతమాత్రం విశ్వసించరని, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని జోగి రమేశ్ విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 650 హామీలు ఇచ్చారని, ఆ హామీల్లో పదింటిని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను చింపి, పార్శిల్ చేస్తానని మంత్రి ప్రకటించారు. ఇక, ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ పాలన అద్వితీయంగా సాగిందని కీర్తించారు.