Rajesh Viswas: ఫోన్ కోసం రిజర్వాయర్ లో నీళ్లు తోడించిన అధికారి జీతంలో కోత
- మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఫుడ్ ఇన్ స్పెక్టర్
- సెల్ఫీ తీసుకుంటుండగా నీళ్లలో పడిపోయిన ఫోన్
- రిజర్వాయర్ లో నీళ్లన్నీ తోడించిన ఫుడ్ ఇన్ స్పెక్టర్
- ఉన్నతాధికారుల ఆగ్రహం
ఛత్తీస్ గఢ్ లో రాజేశ్ విశ్వాస్ అనే ఫుడ్ ఇన్ స్పెక్టర్ ఫోన్ నీళ్లలో పడిందని రిజర్వాయర్ మొత్తం తోడించేసిన సంగతి తెలిసిందే. ఆ అధికారి చర్య మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. భారీ స్థాయిలో కథనాలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు.
రిజర్వాయర్ నీళ్లను వృథా చేశాడంటూ ఆ ఫుడ్ ఇన్ స్పెక్టర్ జీతం నుంచి కోత పెట్టారు. ఆ అధికారి నెలసరి వేతనం నుంచి రూ.53,092 కోత విధించాలని ఆదేశించారు. ఆ అధికారి తన ఫోన్ కోసం రిజర్వాయర్ నుంచి 4,104 క్యూబిక్ మీటర్ల నీటిని వృథా చేశాడని అధికారులు గుర్తించారు.
ఈ నెల 21న రాజేశ్ విశ్వాస్ తన మిత్రులతో కలిసి రిజర్వాయర్ వద్దకు విహారయాత్రకు వెళ్లారు. సెల్ఫీ తీసుకుంటుండగా ఫోన్ జారి నీళ్లలో పడిపోయింది. దాంతో భారీ మోటార్లు పెట్టి నీళ్లన్నీ బయటికి తోడించారు. ఫోన్ దొరికినా, నీళ్లలో తడిసిపోవడంతో పాడైపోయింది. అటు, నీళ్లు తోడేందుకు అనుమతి ఇచ్చిన జలవనరుల శాఖ అధికారులపైనా చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.