Medical Colleges: దేశ వ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు.. 25 శాతం తగ్గిపోనున్న వైద్య కళాశాలలు!
- నిబంధనలు పాటించని మెడికల్ కాలేజీలపై నేషనల్ మెడికల్ కమిషన్ ఉక్కుపాదం
- నెల రోజులకు పైగా మెడికల్ కాలేజీలలో తనిఖీలు
- చాలా కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉన్నట్టు గుర్తింపు
నిబంధనలు పాటించని మెడికల్ కాలేజీలపై వైద్య విద్య, వైద్య నిపుణుల నియంత్రణ సంస్థ అయిన నేషనల్ మెడికల్ కమిషన్ ఉక్కుపాదం మోపుతోంది. మొత్తం 15 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేయబోతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 40 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేసింది. ఈ జాబితాలో అత్యధిక కాలేజీలు గుజరాత్, అసోం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నట్టు సమాచారం.
దాదాపు నెల రోజులకు పైగా మెడికల్ కాలేజీలలో కమిషన్ కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ తనిఖీలను నిర్వహించింది. ఈ తనిఖీల్లో వీరు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆధార్ లింక్ అయిన బయోమెట్రిక్, ఫ్యాకల్టీ రోల్స్ తదితర అంశాలను పరిశీలించారు. చాలా కాలేజీల్లో అధ్యాపకుల కొరత కూడా ఉన్న విషయాన్ని గుర్తించారు.
అయితే లైసెన్స్ రద్దుపై మెడికల్ కాలేజీలు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. 30 రోజుల వ్యవధిలో మెడికల్ కమిషన్ కు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కాలేజీ యాజమాన్యం చేసుకున్న అప్పీల్ ను మెడికల్ కమిషన్ తిరస్కరిస్తే... కేంద్ర వైద్య శాఖను సంప్రదించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో 660 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఎయిమ్స్ కు చెందిన కాలేజీలు 22 ఉన్నాయి. 150 కాలేజీల గుర్తింపు రద్దు అయితే... దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 25 శాతం తగ్గిపోనుంది.