Virender Sehwag: ధోనిపై ప్రశంసలు కురిపించిన సెహ్వాగ్.. వీడియో ఇదిగో!
- వికెట్ల వెనుక ధోనీని ఎవరూ మార్చలేరన్న మాజీ క్రికెటర్
- ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గిల్ ను పెవిలియన్ కు పంపిన వీడియోతో ట్వీట్
- కేవలం 0.1 క్షణాలలోనే రియాక్ట్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారథి మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వినూత్నంగా ప్రశంసించారు. ఎవరైనా సరే బ్యాంకుకు వెళ్లి నోట్లు మార్చుకోవచ్చు కానీ వికెట్ల వెనుక ధోనీని ఎవరూ మార్చలేరని ట్వీట్ చేశారు. ఇప్పటికీ ధోనీ స్పీడ్ తగ్గలేదని, వికెట్ల వెనుక అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడని మెచ్చుకున్నాడు. సోమవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్ మన్ గిల్ ను ధోనీ పెవిలియన్ కు పంపిన వీడియోను సెహ్వాగ్ ట్వీట్టర్ లో పోస్టు చేశారు.
రవీంద్ర జడేజా వేసిన బంతిని ఆడే క్రమంలో గిల్ క్రీజ్ నుంచి బయటకు వెళ్లాడు.. అయితే, బంతి మిస్ కావడంతో తిరిగి క్రీజులో కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. అంతలోనే బంతిని అందుకున్న ధోని వెంటనే వికెట్లను గిరాటేశాడు. బాల్ తన చేతుల్లోకి వచ్చిన తర్వాత వికెట్లను గిరాటేయడానికి ధోనికి పట్టిన సమయం కేవలం 0.1 సెకన్లు మాత్రమే కావడం విశేషం. ఇంత వేగంగా రియాక్ట్ కావడం కేవలం ధోనికి మాత్రమే సాధ్యమంటూ సెహ్వాగ్ మెచ్చుకున్నారు.