Qnet: క్యూనెట్ ను మూసివేసి ఆస్తులు జప్తు చేయాలి: సజ్జనార్
- రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ
- సంస్థ కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచన
- మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్
ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా మోసాలకు తెగబడుతున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. క్యూనెట్ సంస్థ అరాచకాలపై తాజాగా ఆయన స్పందించారు. దేశంలో క్యూనెట్ ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఇలాంటి మోసపూరిత సంస్థల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గొలుసు కట్టు పద్ధతిలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న క్యూనెట్ సంస్థ కార్యకలాపాలపై సమగ్ర దర్యాఫ్తు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. క్యూనెట్ సంస్థను వెంటనే మూసివేసి, సంస్థ ఆస్తులను జప్తు చేయాలని సజ్జనార్ సూచించారు.
‘క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో జనాలను మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేశ్ కన్నాతో పాటు ముగ్గురిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. స్వప్నలోక్ అపార్ట్ మెంట్ లోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సంస్థ ఆర్గనైజర్లతో పాటు ఏజెంట్లనూ అరెస్టు చేయాలి. కంపెనీ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలి. ఇలాంటి సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అంటూ సజ్జనార్ బుధవారం ట్వీట్ చేశారు.