India: 2013కు ముందు భారత్ కాదు.. మోదీ హయాంలో అదుర్స్: మోర్గాన్ స్టాన్లీ
- ప్రపంచవేదికపై దేశ ప్రతిష్ట ఇనుమడించిందన్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్
- ఆసియా సహా ప్రపంచ వృద్ధి పథంలో భారత్ కీలకంగా మారిందని వ్యాఖ్య
- ప్రభుత్వ విధానాల కారణంగా తొమ్మిదేళ్లలో గణనీయమైన మార్పు అన్న మోర్గాన్ స్టాన్లీ
అమెరికాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ... నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశ పరివర్తనను వివరిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని కొనియాడింది. ఆసియా సహా ప్రపంచ వృద్ధి పథంలో భారత్ కీలకంగా మారినట్లు వెల్లడించింది. ప్రభుత్వ విధాన ఎంపికల కారణంగా, ముఖ్యంగా 2014 నుండి భారత్ లో గణనీయమైన మార్పు కనిపిస్తోందని వెల్లడించింది.
భారత వృద్ధిపై సంశయాన్ని వ్యక్తం చేసేవారు 2014 తర్వాత వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవడం లేదని అభిప్రాయపడింది. భారత్ ఇంకా తన పూర్తిస్థాయి శక్తిసామర్థ్యాలను అందుకోలేదని, ఇక్కడి ఈక్విటీ మార్కెట్లు అధిక ధరల వద్ద కదలాడుతున్నాయనే విమర్శలను ప్రస్తావించింది. గత తొమ్మిదేళ్లుగా వ్యవస్థాగతంగా వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకోలేదని, దీంతో ఇలాంటి విమర్శలు వస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుత భారత్ 2013తో పోలిస్తే భిన్నమని, పదేళ్ల స్వల్పకాలంలో గణనీయమైన మార్పులు కనిపించాయని, ప్రపంచ వేదికపై భారత్ కీలక స్థానం చేరుకుందని పేర్కొంది. ఒక దశాబ్దం కంటే తక్కువ కాలంలో ఈ రూపాంతరం చెందిందని ప్రశంసించింది. కార్పోరేట్ పన్ను తగ్గింపు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు వంటి సంస్కరణలు ఎంతో కీలకమని పేర్కొంది. జీఎస్టీ వసూళ్లు పెరగడం, జీడీపీలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ శాతం గణనీయంగా పెరగడం ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణకు దోహదం చేసినట్లు తెలిపింది.