Alappuzha: అలప్పుళ-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో మళ్లీ మంటలు
- రైల్వే స్టేషన్‌లో ఆగివున్న సమయంలో బోగీలో మంటలు
- అప్రమత్తమై ఇతర బోగీలను వేరు చేసిన సిబ్బంది
- ఏప్రిల్ 2న ఇదే రైలులో తోటి ప్రయాణికులపై పెట్రోలు పోసి నిప్పంటించిన షారూఖ్ సఫీ
- చిన్నారి సహా ముగ్గురి మృతి
అళప్పుల-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. కన్నూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆగివున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఓ కోచ్‌లు మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేషన్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
కోచ్‌లో అగ్నికీలలు ఎగసిపడిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మిగతా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలులోకి ఎక్కిన కాసేపటికే ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.
కాగా, ఏప్రిల్ 2న ఇదే రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి సహ ముగ్గురు మరణించారు. నిందితుడు షారూఖ్ సఫీ కోచ్‌లోని తోటి ప్రయాణికులపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే రైలులో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.