ola s1 pro: ఓలా స్కూటర్ ప్రియం.. రూ.15 వేల పెంపు
- సబ్సిడీలను 33 శాతం తగ్గించిన కేంద్ర సర్కారు
- నేటి నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం
- మూడు రకాల మోడళ్లపై రూ.15వేలు పెంచిన ఓలా
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై కేంద్ర సర్కారు ఇస్తున్న సబ్సిడీకి కోత పడింది. ఫేమ్-2 పథకం నూతన సబ్సిడీ విధానం నేటి నుంచి (జూన్ 1) అమల్లోకి వచ్చింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఓలా మొత్తం మీద మూడు రకాల స్కూటర్లను విక్రయిస్తోంది. ప్రతి మోడల్ పై రూ.15 వేల చొప్పున పెంచింది.
ఇప్పటి వరకు ఓలా ఎస్ 1 ధర రూ.1.15 లక్షలుగా ఉంది. దీన్ని నేటి నుంచి రూ.1.30 లక్షలు చేసింది. ఇది ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర. రాష్ట్రాల వారీగా ఈ ఎక్స్ షోరూమ్ ధర మారుతుంది. దీనికి అదనంగా రిజిస్ట్రేషన్ చార్జీలు, బీమా చార్జీలు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తుంది. 3 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన ఓలా ఎస్ 1 ఒక్కసారి చార్జ్ చేస్తే 141 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
ఎక్కువగా ప్రజాదరణకు నోచుకున్న ఓలా ఎస్ 1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు పెరిగింది. 4 కిలోవాట్ హవర్ సామర్థ్యంతో ఉండే దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 181 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక చివరిగా అందుబాటు ధరలోని ఓలా ఎస్1 ఎయిర్ మోడల్.. ఇప్పటి వరకు రూ.85 వేలు ఉంటే, రూ.1-1.10 లక్షలుగా మారింది. ఎస్ 1 ఎయిర్ లోనూ 3 కిలోవాట్ హవర్ బ్యాటరీనే వినియోగించారు. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 125 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.