Monsoon: రాష్ట్రంలోకి నైరుతి రాక జూన్ రెండో వారంలోనే!

Monsoon to hit Telangana in 2nd week of June

  • ఈసారి ఐదు రోజులు ఆలస్యంగా తెలంగాణకు..
  • ఒకటి రెండు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
  • రాష్ట్రంలో తగ్గనున్న ఎండల తీవ్రత.. ఐఎండీ అంచనా

నైరుతి రుతుపవనాల రాకపై హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెల రెండో వారంలో రాష్ట్రాన్ని రుతుపవనాలు పలకరిస్తాయని పేర్కొంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఐదు రోజులు ఆలస్యంగా వస్తున్నాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో కేరళను తాకుతాయని అధికారులు చెప్పారు. రుతుపవనాల రాకతో తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వివరించారు. బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు తెలిపారు. 

అత్యధికంగా నల్లగొండలో 41.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌ 40.9, భద్రాచలం, మెదక్‌ జిల్లాల్లో 40.8 చొప్పున, ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే.. 50 శాతం అధిక వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 2021లో రాష్ట్రంలో 111.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 2022 సీజన్‌లో 109.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నేడు, రేపు వర్ష సూచన
సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తున స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా గురు, శుక్ర వారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ చిరుజల్లులతో తొందరపడి విత్తనాలు నాటుకోవద్దని రైతులకు సూచించింది.

  • Loading...

More Telugu News