YS Sharmila: బీఆర్ఎస్తో పొత్తుపై వైఎస్ షర్మిల ఏమన్నారంటే..!
- కాళేశ్వరం ప్రాజెక్టులో డెబ్బైవేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన షర్మిల
- తెలంగాణలో ప్రతి ఒక్కరి తలపై రూ.1 లక్షన్నర అప్పు భారముందని వ్యాఖ్య
- రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని విమర్శ
- అభ్యర్థులను తయారు చేసుకొని పోటీ చేస్తామని వెల్లడి
- పొత్తులపై బీజేపీ, కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్
రానున్న ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునేది లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. హైదరాబాద్ గన్ పార్కు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ తో ఎప్పటికీ పొత్తు పెట్టుకునేది లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో డెబ్బైవేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి తలపై రూ.లక్షన్నర అప్పు భారం ఉందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు షర్మిల పది ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రంలో అవినీతి సొమ్ము అంతా కేసీఆర్ దగ్గరే ఉందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను సీఎం తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తన పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తానని కొంతమంది మాట్లాడుతున్నారని, అలా మాట్లాడుతూ ఓ మహిళ కష్టాన్ని అవమానించవద్దని సూచించారు.
తాను అభ్యర్థులను తయారు చేసుకొని ఎన్నికల్లో పోటీలో నిలబెడతానని చెప్పారు. కానీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేది లేదన్నారు. పొత్తులపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. తాను పార్టీలో చేరాలనుకుంటే పార్టీ పెట్టకముందే చేరేదానిని అని, తాను చేరుతాను అంటే చేర్చుకోని పార్టీ ఉంటుందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చే అవకాశం లేదన్నారు. బీఆర్ఎస్ తో ఎన్నికలకు ముందు, తర్వాత పొత్తు ఉండదని కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.