Team India: బీసీసీఐ-పీసీబీ మధ్య కుదరని సయోధ్య.. పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్?

asia cup 2023 could be held without pakistan team

  • పాక్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకోని బీసీసీఐ
  • శ్రీలంకలో నిర్వహించాలని పట్టు.. ఏసీసీ సభ్య దేశాలదీ ఇదే మాట
  • ఆసియా కప్ ను బహిష్కరించాలని భావిస్తున్న దాయాది
  • అదే జరిగితే అక్టోబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కూ దూరం?

ఆసియా కప్ ఎక్కడ నిర్వహించాలనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. టోర్నీ నిర్వహణ విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదరకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పాకిస్థాన్ లో పర్యటించేందుకు నిరాకరించిన బీసీసీఐ.. తటస్థ వేదికగా దుబయ్ లో ఆడేందుకు ససేమిరా అంటోంది. దీంతో ఆసియా కప్ ను బాయ్ కాట్ చేయాలని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఇదే ఏడాది భారత్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.

ఆసియా కప్‌ సెప్టెంబర్‌ 2 నుంచి 17 వరకు జరిగే అవకాశం ఉంది. అయితే ఆసియా కప్‌ కోసం పాకిస్థాన్ లో టీమిండియా పర్యటించేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించాలని పీసీబీ భావించింది. హైబ్రిడ్‌ మోడ్‌ ప్రకారం పాక్‌లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని, భారత్‌ ఆడే మ్యాచ్‌లను మాత్రం దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీ అనుకుంది. కానీ హైబ్రిడ్‌ మోడ్‌కు బీసీసీఐ అంగీకరించలేదని సమాచారం. దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉంటుందని, ఆటగాళ్లు తట్టుకోలేరని ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్)కి బీసీసీఐ వివరించినట్లు సమాచారం. ఏసీసీలోని ఇతర సభ్య దేశాలు కూడా పాక్‌ ప్రతిపాదించిన హైబ్రీడ్‌ మోడ్‌కు ఒప్పుకోనట్లు తెలిసింది.

దీంతో పాకిస్థాన్‌ లేకుండానే ఆసియా కప్‌ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ మినహా ఆసియా కప్‌ ఆడేందుకు ఏసీసీ సభ్యులందరూ అంగీకరించినట్లు తెలిసింది. పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో ఆసియా కప్ నిర్వహించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు కట్టుబడి ఉంది.

త్వరలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనే ఇతర దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి సందేశం పంపే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఈవెంట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనకపోతే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్‌ జట్లు.. శ్రీలంక వేదికగా ఆసియా కప్‌లో ఆడతాయి.

అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఇప్పుడు పాకిస్థాన్‌ హైబ్రిడ్ మోడల్‌ను భారత్ తిరస్కరిస్తే.. అక్టోబర్, నవంబర్‌లలో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం ఉంది. అదే జరిగితే బీసీసీఐ కన్నా పీసీబీనే ఎక్కువగా నష్టపోతుంది. కాకపోతే.. టోర్నీలో కాస్త మజా తగ్గుతుంది. టీమిండియా, పాక్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ ఎదురుకానుంది.

  • Loading...

More Telugu News